హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ పాటించకుండా డ్యూటీకు గైర్హాజరైన 183 మంది టీచర్లకు డీఈవో యాదయ్య షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల పాతబస్తీ, సికింద్రాబాద్, కోఠి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో కలెక్టర్ ప్రియాంక ఆల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
స్కూళ్లలో ఎఫ్‌ఆర్‌ఎస్ విధానం అమల్లో ఉన్నప్పటికీ, 183 మంది టీచర్లు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గైర్హాజరైనట్లు తనిఖీల్లో తేలింది. బాధ్యతారహితంగా వ్యవహరించిన టీచర్లను వివరణ కోరుతూ డీఈవో నోటీసులు ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సస్పెన్షన్ వేటు తప్పదని హెచ్చరించారు. టీచర్లు క్రమం తప్పకుండా ఎఫ్ఆర్‌ఎస్ ద్వారా హాజరు నమోదు చేసేలా పర్యవేక్షించే బాధ్యతను సంబంధిత మండలాల ఎంఈవోలకు అప్పగించారు.
